వార్త : ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ పిలుపునిచ్చారు.
చెవాకు : తల పండిన రాజకీయ వేత్తగా, లోక్‌సభ స్పీకర్‌గా కూడా ఉన్న మీకు అందరి చరిత్ర తెలిసిందే. మీ నేతృత్వంలో సాగుతున్న ప్రస్తుత సభలో నేర, అవినీతి కార్యకలాపాల్లో పాలు పంచుకోని వారిని వేళ్లపై లెక్కించవచ్చన్నది కూడా మీకు తెలుసు.
ప్రజాస్వామ్య బద్ధంగా అలాంటి వారందరూ కలసి ఎంపిక చేస్తేనేగా మీరు లోక్‌సభ స్పీకర్ పదవిని అధిరోహించారు. వారు ఏ రోజైనా మీ చెడు కోరారా? మీరు మాత్రం వారిని వెనక్కి పిలిపించుకునే అధికారం ప్రజలకు ఉండాలనడంలో ఆంతర్యమేమిటి?
భారీగా ఖర్చు పెట్టి, రౌడీయిజం, రిగ్గింగ్ వంటి అన్ని సామ, దాన, దండోపాయాలతో ఆ పదవి నెక్కిన వారు ఇలాంటి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడితే మద్దతిస్తారా? ప్రస్తుత పార్లమెంటు చివరి దశకు చేరినందున వారి తర్వాత వచ్చే వారికే వర్తిస్తుంది కాబట్టి దీనికిమద్దతిస్తారనుకుంటున్నారా?
ప్రస్తుత లోక్‌సభ సభ్యులు మీలా సన్యాసం తీసుకోవాలనుకోవడం లేదు. తర్వాత మళ్లీ బరిలో దిగి, ప్రజలకు ఎంతో సేవ (అదేనండీ సేవ) చేయాలనుకుంటున్నారులెండి. తమ వల్ల కాకున్నా తమ వారసుల ద్వారా అయినా ప్రజా సేవకు సిద్ధమవుతున్న వారిపై మీకు ఇంత కోపం ఉండటం సరికాదండోయ్.