వార్తః పది నెలల తర్వాత మళ్లీ తాను ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన తాను సీఎం పదవి తప్ప మరో పదవి తీసుకోబోనన్నారు.
చెవాకుః ఈ అనవసర ప్రకటనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టం కొనితెచ్చు కుంటారేమో. టీడీపీ గెలిస్తా మీరే ముఖ్యమంత్రి అవుతారనే విషయం అందరికీ తెలిసిందే. దాన్ని మరీ నొక్కి చెబితే ఎవరి ఆలోచనలు వారికి రావచ్చు.
మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీపై మీకు ఉన్నంత పట్టు ఇపుడు లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మీరెందుకు తొందరపడుతున్నారో తెలియడం లేదు.
గత పర్యాయం నక్సల్ దాడితో సానుభూతి దొరికిపోతుందనుకుని ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఏమైంది? అప్పట్లోనే కాస్త ఆలోచించి, ఆ సమయాన్ని ప్రజలకు మంచి పనులు చేసేందుకు ఉపయోగించుకని ఉంటే మరోలా ఉండేదోమో.
ఇపుడు కూడా మీ మాటను ధిక్కరించే నేతలు పార్టీలో అధికమయ్యారని తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోవడం ఉత్తమం. అలాకాక అంతా మీరే చేస్తున్నట్టు రాజకీయం నడిపించాలనుకుంటే మాత్రం కష్టమే.
అయినా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఈ లోపు ఎన్నో మార్పులు జరగవచ్చు. తెలంగాణా రావచ్చు లేక రాకపోవచ్చు. మీ తృతీయ ఫ్రంట్ పరిస్థితి తేలాల్సి ఉంది. చిరంజీవి రాజకీయ ప్రవేశం జరగొచ్చు.
అధికార పార్టీ మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ఓటర్లను మచ్చిక చేసుకోవచ్చు. ఇన్ని మార్పులకు ఆస్కారమున్న తరుణంలో ఎందుకీ తొందర. జాగ్రత్తగా ముందుకెళ్లడం మంచిదేమో.