పానకంలో పుడకా?

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (16:05 IST)
వార్త : ప్రత్యేక తెలంగాణపై టీడీపీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న సందర్భంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను కలిపి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మరో కొత్త వాదన విన్పించారు.

చెవాకు : ఇదేంటయ్యా పానకంలో పుడకలా చేరావు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తుంటే ఈ కొత్త వాదన ఎందుకయ్యా.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు తెరాస అంగీకరించి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎపుడో ఏర్పడి ఉండేదని అందరికీ తెలిసిందే. అసలు వివాదమే అక్కడేకదా ఉండేది.

కోట్ల రూపాయల్లో అక్కడ ఆస్తులు కూడగట్టుకున్న సెటిలర్లు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా ఉంచాలని కోరుతున్నందునేగా ఈ వివాదమంతా. తెలంగాణ విడుదల కోసం రజాకార్ల హింసను భరించామంటున్న మీకు తెలంగాణలో హైదరాబాద్ ఉంటే వచ్చే నష్టమేంటో బోధపడటం లేదు.

మరో రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చేస్తాయనుకుంటున్నారేమో. మీ ఆశ నెరవేరుతుందో లేదో తెలియని స్థితిలో దానికోసం ప్రత్యేక రాష్ట్రం వివాదాన్ని లేవనెత్తడం మంచిది కాదండోయ్. బాగా ఆలోచించండి.

వెబ్దునియా పై చదవండి