ఒకసారైతే ఫరవాలేదు కానీ...!

శనివారం, 27 సెప్టెంబరు 2008 (17:41 IST)
వార్త : మంత్రి చెంగారెడ్డితో విభేదాల కారణంగా త్వరలో పార్టీ నుంచి బయటకు వెళ్లగలరని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌తో సమావేశమయ్యేందుకు మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు తిరస్కరించారు.

చెవాకు : రాజకీయాల్లో ఒకసారి తప్పటడుగు వేస్తే పొరబాటు అంటారు. మళ్లీ మళ్లీ అదే రకమైన తప్పులు చేస్తూ వెళితే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. మీ వంటి మేధావికి ఈ చిన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరం.

ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఆయన మరణానంతరం రాజకీయాలు అంతగా అచ్చి రాలేదని పిస్తోంది. చంద్రబాబుతో విభేదాల కారణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చిన మీరు ఆ తర్వాత అయినా సరైన అవకాశం లభించేవరకు వేచి చూడాల్సింది.

చెంగారెడ్డితో మొదట్నుంచీ పడదనే విషయం మీకు బాగానే తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరకుండా ఉండొచ్చుగా, ఆ సమయానికి రాజకీయం జరిగితే చాలనుకున్నారు కాబట్టే మీ పరిస్థితి ఇలా తయారైంది.

గత శాసనసభ ఎన్నికల సమయంలోనే టీడీపీలో చేరిపోతారని ప్రచారం రావడంతో మీపై కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం పడిపోయింది. అదే మీకు మంత్రి పదవి దక్కకుండా చేసిందని కూడా చెప్పవచ్చు.

జరిగిందేదో జరిగిపోయింది ఈ దఫా అయినా సరైన అడుగు వేయండి. రాజకీయాల్లో మీరు వేసే చివరి అడుగు ఇదిగానే ఉండాలి. మిమ్మల్ని ముందుకు తీసుకు వెళుతుందా లేదా అనే విషయాన్ని బాగా ఆలోచించి ఈ సారైనా సరైన అడుగు వేయండి.

వెబ్దునియా పై చదవండి