ఒకే ఒరలో రెండు కత్తులు..సాధ్యమేనా?

వార్త: కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తాము జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న తృతీయ ఫ్రంట్‌లోకి కలసి రావాలని తమను కలిసిన ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి మిత్రాతో సీపీఎం నేతలు అన్నారు.

చెవాకు: మీరు చెబుతున్నట్టు అయితే టీడీపీ, తెరాసలతో ప్రజారాజ్యం పార్టీ కూడా పొత్తు పెట్టుకోవాలన్న మాట. ఒక ఒరలో రెండు కత్తులు పట్టవని తెలిసి కూడా ఈ ప్రతిపాదన చేయడం సబబుగా ఉందా?

ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్న టీడీపీ, పీఆర్‌పీ చీఫ్‌ల మధ్య మీరెలా రాజీ కుదర్చగలరు. సీట్ల సర్దుబాటులో ఎవరికి ఎక్కువ సీట్లు ఇప్పించగలరు? టీడీపీ, తెరాస అయినా రేపు మీ అభిమతానికి విరుద్ధంగా తెలంగాణా ఏర్పడిన పక్షంలో రెండు రాష్ట్రాలను చెరొకటి పంచుకోవచ్చని అంగీకరించగలవు. ప్రజారాజ్యం పార్టీకి అది సాధ్యమేనా?

మీరు చెబుతున్న ఆ రెండు పార్టీలు మీతోనే ఉంటాయని మీరు ఖచ్ఛితంగా చెప్పగలరా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారానికి కొద్ది దూరంలో ఉంటే ఈ పార్టీలు ప్లేటు ఫిరాయించబోవని గ్యారంటీ ఏమిటి? ఇంతకీ బహుజన్ సమాజ్ పార్టీపైన అయినా మీరు ఖచ్ఛితమైన హామీ ఇవ్వగలరా?

రాష్ట్రంలో మీ బలానికి తగ్గట్టు ఎవరితోనో ఒకరితో సర్దుకుపోవడం వరకైతే ఫరవాలేదుకానీ, మీతో కలిసి రమ్మని చెప్పడం లేక ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిర్చే సామర్థ్యం మీకు లేదనే విషయాన్ని అర్ధం చేసుకోండి.

వెబ్దునియా పై చదవండి