టైంబాంబే...కానీ బయట పేలడం లేదే..!

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (16:06 IST)
FileFILE
వార్త : తమ పార్టీ టైంబాబ్ వంటిదని, వలస పాలకులు జాగ్రత్తగా లేకుంటే ఎపుడు ఎక్కడ ఎలా పేలతాయో చెప్పలేమని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు.

చెవాకు : హమ్మయ్య అసలు విషయం చెప్పారు. దేశమంతా ఇప్పటికే అక్కడక్కడా బాంబులు పేలుతున్నాయని, పేలబోతున్నాయని హెచ్చరికలు వస్తున్న తరుణంలో మీ పార్టీ కూడా ఓ టైంబాంబ్ లాంటిదే అనే సత్యాన్ని రాజకీయనేతలకు చాటి చెప్పేశారు.

అయితే మీ బాంబు చాలా మంచిదని, ఇప్పటివరకు ఎవరిపైనా పేలలేదని మీ ప్రత్యర్థులు చెబుతున్న మాట మీకు విన్పిస్తోందా. ఇంటిలోనే పేలుతోందని ప్రతిపక్షాలు గుసగుసలాడుకుంటున్నాయి.

గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న మీ పార్టీలో ఈ టైంబాంబు పేలిన దెబ్బకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు బయటికెళ్లి వేరు కుంపటి పెట్టుకున్నారని చెబుతున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించేస్తామని చెప్పి, మీరే బోల్తాపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కున్న సమయంలోనూ ఏదో పేల్చేస్తామని మీరు చెప్పినప్పటికీ, ఏమీ జరగలేదు. మీ బాంబు ఎపుడు ఎలా పేలుతుందో చెప్పలేమంటున్నారు కాబట్టి అది మీ ఇంటిలో పేలకుండా చూసుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి