ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ.. ఇప్పటి "లిటిల్ ఫ్రాన్స్"

FILE
రెండు దేశాల సంస్కృతులు కలగలిసిన ఒక విలక్షణమైన ప్రదేశమే ఇది.. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న ఈ ప్రదేశం నేడు "లిటిల్ ఫ్రాన్స్"గా కొనియాడబడుతోంది. భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ ఆ గత చిహ్నాలతో అలరించే అందమైన ప్రాంతంగా, చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశం పేరే "పాండిచ్చేరి".

దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి (పుదుచ్చేరి).. పుదుచ్చేరి, కరైకాల్, యానాం, మాహె అనే నాలుగు విడి విడి జిల్లాల సముదాయం. వీటిలో పాండిచ్చేరి పట్టణం బంగాళాఖాతం తీరాన, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 293 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కరైకాల్ బంగాళాఖాతం తీరంలో, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.

అలాగే.. బంగాళాఖాతం తీరంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగంగా, కాకినాడకు సమీపంలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం విస్తరించి ఉంది. ఇక చివరిదైన మాహె.. అరేబియన్ సముద్ర తీరాన 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పాండిచ్చేరిలోని నాలుగు జిల్లాల జనాభా మొత్తం సుమారు 10 లక్షలకు పైబడే ఉంటుంది.
ఐలాండ్ ఆఫ్ పీస్...!!
బొటానికల్ గార్డెన్. దీన్ని "ఐలాండ్ ఆఫ్ పీస్" అని అనవచ్చు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్ గార్డెన్ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడ డబ్బు ఖర్చుపెట్టకుండా గంటలు గంటలు అలా సరదాగా గడిపేయవచ్చు. భారతదేశంలోని పూల...


ఇకపోతే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటే.. 'పుదు' అంటే 'కొత్త' అనీ; 'చ్చేరి' అంటే 'ఊరు' అంటే "కొత్త ఊరు" అని అర్థం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీన్ని ఫ్రెంచివాళ్లు పాండిచ్చేరి అని పిలిచేవారు. ఎప్పుడో పొరపాటున ఇంగ్లీషులో 'యు' బదులు 'ఎన్' అని రాయటంవల్ల ఇది ఆంగ్లంలో "పాండిచేరి" అని పిలవటం మొదలయ్యింది. తరువాత అదే పాండిచ్చేరిగా స్థిరపడిపోయింది.

1673లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు పాండిచ్చేరిలో నెలకొల్పిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికారకేంద్రం మారిపోయింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్, డచ్చి వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందాల ప్రకారం పుదుచ్చేరి పై అధికారం మారుతూ వచ్చింది. ఆ తరువాత 1962 వరకూ ఇది ఫ్రెంచివారి ప్రదేశంగా మారిపోయింది. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఫ్రెంచివారి సంస్కృతి పాండిచ్చేరిలో ఉన్న అనేక ప్రదేశాల పేర్లలో కనిపిస్తూ ఉంటుంది.

పాండిచ్చేరిలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బీచ్, బొటానికల్ గార్డెన్, మ్యూజియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "సెరినిటీ బీచ్". ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే ఆహ్లాదకరమైన గాలిని ప్రతి ఒక్కరూ స్వానుభవంగా తెలుసుకోవాల్సిందే.

FILE
ఈ సెరినిటీ బీచ్‌లో ఉన్న రెండు చారిత్రక కట్టడాల గురించి చెప్పుకోవాల్సిందే. అందులో ఒకటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం. బీచ్‌కు కొంచెం దూరంలో ఉండే లైట్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే నమ్మలేం కాబట్టి. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్‌ మాత్రమే కాదు.. అనేక చారిత్రక కట్టడాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఫ్రెంచ్ సంస్కృతి, పచ్చదనం.... ఇలా చెప్పుకుంటూ పోవచ్చు.

తరువాత చెప్పుకోవాల్సింది.. బొటానికల్ గార్డెన్. దీన్ని "ఐలాండ్ ఆఫ్ పీస్" అని అనవచ్చు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్ గార్డెన్ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడ డబ్బు ఖర్చుపెట్టకుండా గంటలు గంటలు అలా సరదాగా గడిపేయవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ చూడవచ్చు.

ఈ బొటానికల్ గార్డెన్‌లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని రేర్ ఆర్నమెంటల్ చేపలు భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను మిస్ అవకపోతే మంచిది. ఇక మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.

పాండిచ్చేరికి ఎలా వెళ్లాలంటే.. విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెన్నయ్ ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడ దిగి విల్లుపురం రైల్ జంక్షన్ మీదుగా పాండిచ్చేరి చేరవచ్చు. పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం.. రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడ దిగినా రోడ్డు మార్గంలో సులభంగా పాండిచ్చేరి చేరవచ్చు.

వసతి విషయాలను చూస్తే.. బడ్జెట్ హోటళ్లలో అయితే రోజుకు 600 రూపాయల అద్దెతో గదులు అందుబాటులో ఉంటాయి. స్డాండర్ట్ హోటళ్లలో అయితే రోజుకు 2000-3000 రూపాయల అద్దెతో లభిస్తాయి. అదే లగ్జరీ హోటళ్లలో అయితే రోజుకు దాదాపు 5 వేల రూపాయల నుంచి గదులు లభిస్తాయి. నవంబర్ జనవరి మధ్య, వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే భలే మజాగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి