బ్రెగ్జిట్ పోల్స్ ఎఫెక్టు : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. బ్లాక్ ఫ్రైడే

శుక్రవారం, 24 జూన్ 2016 (10:09 IST)
'బ్రెగ్జిట్' ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్‌తో పాటు.. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్‌లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్‌లో 940 పాయింట్ల వరకు పతనమైంది. ప్రస్తుతం 800-700 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది.
 
కాగా, తాజా పోల్ ఫలితాల్లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న అంతర్జాతీయ మీడియా వార్తల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్‌తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది.
 
దీంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్‌కు 'బ్లాక్ ఫ్రైడే'గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ప్రజలు తీర్పిస్తున్నారని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా హరించుకుపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి