నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను మోసం చేసి.. తాను మరో మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు చైనా బాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ వెల్లడించాడు. ఇటీవలే లిన్ డాన్ భార్య తమ తొలిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ 'మిస్టరీ మహిళ'తో లిన్ డాన్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి.
'డిటెక్టివ్ ఝావో' అనే నెటిజన్ ఆన్లైన్లో పోస్టుచేసిన ఈ ఫొటోలు లిన్ డాన్ అభిమానుల్ని షాక్‌కు గురిచేశాయి. లిన్‌తో తిరిగిన సదరు మహిళ ప్రముఖ మోడల్, నటి ఝావో యాకిగా తేలింది. గత సెప్టెంబర్ నెలలో ఓ రెస్టారెంట్ వద్ద లిన్, యాకీ సన్నిహితంగా తిరుగుతుంటే తాను గమనించి.. వారిని అనుసరించానని, లిన్ యాకీని తన ఇంటికి తీసుకెళ్లాడని, 2 గంటలు గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారని, ఆ తర్వాత ఒక హోటల్లోను వారు రాసలీలలు నెరిపారని డిటెక్టివ్ ఝావో పేర్కొన్నాడు.
లిన్ భార్య గ్జీ జింగ్ఫంగ్ కూడా బ్యాడ్మింటన్ చాంపియన్. ఆమె ఈ నెల 5న బిడ్డను ప్రసవించింది. ఈ క్రమంలోనే లిన్, యాకీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగుచూడటంతో చైనా సోషల్ మీడియా సైట్ వీబోలో అతనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో లిన్ డాన్ స్పందిస్తూ ' ఒక వ్యక్తిగా నా తప్పులకు సాకులు వెతుక్కోను. నా ప్రవర్తన కుటుంబాన్ని గాయపరిచింది. అందుకే నా కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా'అని ఆయన పేర్కొన్నాడు.