ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడలో మితర్వాల్ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే 50మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఓం మితర్వాల్ కాంస్య పతకం సాధించాడు. ఇప్పటివరకు భారత్‌కు 22 పతకాలు రాగా.. అందులో 11 బంగారం, 4 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో ఎక్కువ పతకాలు సాధించిన లిస్ట్‌లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు 21వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు కొత్త చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో అత్యధికంగా 9 పతకాలు సాధించి బరిలో నిలిచిన 35 దేశాల కంటే అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా ఐదు స్వర్ణ, రెండు రజత, రెండు కాంస్య పతకాలతో 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిలిఫ్టర్లు ప్రథమ స్థానంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తెలుగు తేజం.. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున మెన్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. తద్వారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తర్వాత శ్రీకాంత్ ఈ రికార్డు కొల్లగొట్టనున్నాడు.