ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య క్రీడా పోటీలు కూడా కరువైయ్యాయి. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నాయే కానీ.. భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టో, పాక్‌లో భారత టీమో పర్యటించట్లేదు.
ఈ నేపథ్యంలో ఇండో-పాక్ టెన్నిస్ ఆటగాళ్లు మాత్రం.. 'స్టాప్ వార్.. స్టార్ట్ టెన్నిస్' పేరిట రోహన్ బోపన్న- ఖురేషిలు పిలుపునిచ్చారు. ఇద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్ లోనే ఓటమిపాలైన ఖురేషీ ఆదివారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు లండన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై గెలిస్తేనే పాక్ జట్టుకు ఘన స్వాగతం ఉంటుందని, భారత్ పై ఓడితే మాత్రం చీత్కారాలు తప్పవని స్పష్టం చేశాడు.
పాకిస్థాన్‌కు మద్దతివ్వాలని తాను బోపన్నను అడగను. అలాగే భారత్‌కి మద్దతివ్వమని ఆయన తనను అడగడని చెప్పాడు. తాము చాలా కాలంగా స్నేహితులమని అన్నాడు. టెన్నిస్ కోర్టు బయటైనా, లోపలైనా రోహన్ తనకు సోదరుడులాంటి వాడని చెప్పాడు. భారత్-పాక్ మధ్య విభేదాలకు ఏవో కారణాలున్నాయి. కానీ తమ మధ్య అలాంటివి లేవని, తామిద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటామని చెప్పాడు.