రియో డి జనీరో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బంగారు చేప మైకేల్ ఫెల్ప్స్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ గోల్డ్ ఫిష్ 2168 యేళ్ళనాటి రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో 22వ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, వ్యక్తిగతంగా ఇది 13వ గోల్డ్ మెడల్.
తాజాగా జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌ను ఒక నిమిషం 54.66 సెకన్లలో పూర్తి చేశాడు. రేసు మధ్యలో అతని సహచరుడు లోషె గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినా.. చివరికి అతను ఐదోస్థానంతో సరిపెట్టుకున్నాడు. రియోలో ఫెల్ప్స్ ఇప్పటివరకు రెండు వ్యక్తిగత, రెండు రిలే గోల్డ్ మెడల్స్ గెలిచాడు. ఇక వ్యక్తిగత ఈవెంట్లలో ఇప్పటివరకు 13 గోల్డ్ మెడల్స్ గెలిచి 2168 ఏళ్ల కిందట లియోనిడాస్ (క్రీ.పూ.152లో) సృష్టించిన రికార్డును బీట్ చేశాడు.
ప్రాచీన ఒలింపిక్స్‌లో భాగంగా క్రీ.పూ.164 నుంచి క్రీ.పూ.152 మధ్య రన్నర్ లియోనిడాస్ 12 వ్యక్తిగత స్వర్ణాలు గెలిచాడు. అంతేకాకుండా, వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్ గెలిచిన తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే ఈవెంట్‌ను వరసగా నాలుగు ఒలింపిక్స్‌లో గెలిచిన మూడో ఒలింపియన్ ఫెల్ప్స్ కావడం గమనార్హం.