పోతేపో కశ్యప్ అంటున్నారా గోపీచంద్... స్టార్ షట్లర్ కశ్యప్ బెంగళూరుకు మకాం మార్చాడు... ఎందుకు?

గురువారం, 25 ఆగస్టు 2016 (13:43 IST)
హైదరాబాద్: షటిల్ బ్యాడ్మింట‌న్ గురువు గోపీచంద్‌కు మ‌రో శిష్యుడు షాక్ ఇచ్చాడు. స్టార్ షెట్ల‌ర్ క‌శ్య‌ప్ ఇపుడు త‌న మ‌కాం బెంగ‌ళూరుకు మార్చేశాడు. రెండేళ్ల క్రితం సైనా నెహ్వాల్ తన గురువు గోపీతో బంధానికి కటీఫ్ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో ఇప్పుడు మరో శిష్యుడు పారుపల్లి కశ్యప్ కూడా గోపీ అకాడమీ నుంచి తప్పుకోవడం క్రీడాభిమానుల‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆరంభం నుంచి గోపీ అకాడమీలో శిక్షణ పొందుతున్న 29 ఏళ్ళ కశ్యప్.. రాబోయే రెండు నెలల పాటు బెంగళూరులోని టామ్ జాన్ అకాడమీలో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలిపాడు. 
 
వచ్చే నెలలో జరుగనున్న ఇండోనేసియా, జపాన్, కొరియా టోర్నీలలో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కశ్యప్ చెప్పాడు. ఒలింపిక్స్‌కు ముందు మోకాలి గాయం వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నా... రియోకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది... నేను మునుపటి ఫామ్‌ను సంతరించుకోవాలంటే కొత్త రకంగా, ఎక్కువగా కష్టపడాలి. అందుకే శిక్షణ కోసం బెంగళూరులోని టామ్ జాన్ అకాడమీని ఎంచుకున్నా. ఫిట్‌నెస్ నిపుణుడు డెక్‌లైన్ లియాటో ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఇదే. 
 
వచ్చే నెలలో టోర్నీలు ముగిశాక మళ్లీ హైదరాబాద్‌కు వెళ్తా అని కశ్యప్ పేర్కొన్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు సృష్టించిన 29 ఏళ్ల కశ్యప్‌ను ఓ ఏడాది మొత్తం గాయాలు తీవ్రంగా వేధించాయి. గతేడాది అక్టోబర్‌లో కాలిపిక్క, కడుపు కండరాల నొప్పితో బాధపడ్డ ఈ హైదరాబాదీ సయ్యద్ మోదీ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. తర్వాత దక్షిణాసియా క్రీడల నుంచి వైదొలిగాడు. అయితే రియో ఒలింపిక్స్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న కశ్యప్ మార్చిలో జర్మనీ ఓపెన్‌లో బరిలోకి దిగినా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో పాటు మలేసియా, సింగపూర్ ఓపెన్‌లకూ దూరంకావడంతో కశ్యప్ రియోకు అర్హత సాధించలేకపోయాడు. 
 
కుడి మోకాలిలో కణజాలం పూర్తిగా దెబ్బతింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో శస్త్రచికత్స చేయించుకున్నా దీని నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. పరిస్థితుల్లో మార్పు కోసం ఓ రెండు నెలలు బెంగళూరులో ఉండాలని నిర్ణయించుకున్నానని కశ్యప్ వెల్లడించాడు. 
 
గోపీ ప‌ట్టించుకోవ‌డం లేదా? 
రెండేళ్ళ క్రితం దాకా అంతర్జాతీయ ఈవెంట్లలో టాప్ షట్లర్లను ఓడించి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కశ్యప్ ఇప్పుడు అంతగా ఫామ్‌లో లేడు. అదే సమయంలో కిడాంబి శ్రీకాంత్, గురుసాయి దత్‌లాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడం.. వీళ్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తుండటం.. వీళ్లపై గోపీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటం వల్లే కశ్యప్ గోపీ అకాడమీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. పైకి మాత్రం జాన్ అకాడమీలో రెండు నెలలే శిక్షణ అని చెబుతున్నా.. దీర్ఘకాల ప్రణాళికతోనే కశ్యప్ అక్కడికి పయనమవుతున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి