చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. 1980 తర్వాత కాంస్య పతకం

గురువారం, 5 ఆగస్టు 2021 (09:33 IST)
Indian Hockey Team
ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కి చేరే సువర్ణావకాశాన్ని భారత మహిళల హాకీ టీమ్ చేజార్చుకుంది. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. గురువారం జరిగిన మ్యా‌చ్‌లో జర్మనీపై 5-4తో విజయాన్ని సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆరంభంలో భారత హాకీ టీం కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లు ఎక్కువగా నమోదు కావడం విశేషం.
 
అంతకముందు మ్యాచ్ ఆరంభంలో రెండో నిమిషానికి ప్రత్యర్ధి జర్మనీ జట్టు గోల్ వేయగా.. భారత్ మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్ తర్వాత భారత్ పుంజుకుంది. సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమం అయింది. అటు మూడో క్వార్టర్‌లో భారత్, జర్మనీ అమీతుమీ తేల్చుకున్నాయి. మొదట జర్మనీ రెండు గోల్స్ వేయగా, ఆ తర్వాత పెనాల్టీ కార్నర్‌లు అందిపుచ్చుకుని భారత్ హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో స్కోర్ సమం చేసింది.
 
ఇక మూడో క్వార్టర్‌లో భారత్ పూర్తిగా పైచేయి సాధించింది. ఆరంభంలో ఒక గోల్.. ఆ వెంటనే మరో గోల్ సాధించి 5-3తో ఆధిక్యం సాధించింది. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్ధికి మరో గోల్ దక్కకుండా డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లి గేమ్‌ను ముగింపుకు తీసుకొచ్చింది. ఇక చివర్లో జర్మనీ గోల్ చేయడంతో స్కోర్ 4-5 కాగా.. అక్కడ నుంచి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో జర్మనీ షూట్ అవుత పెనాల్టీని అడ్డుకోవడంతో భారత్ అపూర్వ విజయాన్ని అందుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు