కరోనా ఎఫెక్టు : టోక్యో ఒలింపిక్స్ పోటీలు వాయిదా

మంగళవారం, 24 మార్చి 2020 (19:26 IST)
కరోనా వైరస్ ప్రభంజనం ముందు అనేక క్రీడాసంగ్రామాలు వాయిదాపడుతున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ క్రీడా పోటీ వాయిదాపడింది. అదే టోక్యో ఒలింపిక్స్ పోటీలు. ఈ పోటీలు జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ పోటీలను వాయిదా వేశారు. ఒలింపిక్స్ పోటీలు వాయిదాపడటం 124 యేళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరాటంలో తలమునకలుగా ఉన్న నేపథ్యంలో జపాన్ లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. 
 
అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని అనేక సభ్య దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే క్రీడలు నిర్వహించేందుకు పట్టుదల ప్రదర్శించింది.
 
కానీ,అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రం కావడంతో జపాన్ ప్రధాని షింజే అబేతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సమావేశమయ్యారు. జపాన్ గడ్డపై జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలను వాయిదా వేయడమే శ్రేయస్కరమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒలింపిక్స్ వచ్చే ఏడాది నిర్వహించే అవకాశాలున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు