జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్‌ను కరోనా కాటేసింది. ఒలింపిక్స్‌లో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించి, వేగంలో చిరుతపులి అని పేరు తెచ్చుకుని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఉసేన్ బోల్ట్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన, కరోనా టెస్ట్ చేయించుకోవడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
అయితే, తన పుట్టిన రోజు ఆగస్టు 21న పలువురిని ఉసేన్ బోల్డ్ కలిశారు. నాడు ఏర్పాటు చేసిన పార్టీలో భౌతిక దూరం కనిపించక పోగా, కనీసం మాస్క్‌లను కూడా ఎవరూ ధరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి హాజరైన వారందరిలోనూ ఆందోళన నెలకొంది. 21న బోల్ట్ ను కలిసిన వారిలో పలువురు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. నాడు ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్‌లతో పాటు బేయర్ లెవెర్కుసేన్, అటాకర్ లియాన్ బెయిలీ తదితరులు కూడా పార్టీకి వెళ్లడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఉస్సేన్ బోల్ట్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ సందర్భంగా ఓ వీడియోను అప్ లోడ్ చేస్తూ... "శుభోదయం... నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. శనివారం నాడు పరీక్షలు చేయించుకోగా, ఖరారైంది. దీంతో నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే నా సన్నిహితులకు దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేవు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. కరోనా ప్రొటోకాల్ గురించి హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని వివరాలను కోరాలని భావిస్తున్నాను. నా దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలి" అని అన్నారు.