కన్నుల పండుగగా సాగిన శ్రీపతి రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఎనిమిదో రోజు ఉదయం వేలాది మంది భక్తజనులు ఉరకలు వేసే ఉత్సాహంలో పాల్గొనగా స్వామివారికి రమణీయమైన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ రథాన్ని"కదలివచ్చే ఆలయం"గా విజ్ఞులు వర్ణించారు. సృష్టి సవ్యంగా సాగడానికి అనేకానేక తీరుల రథాలను (అనంత ఆత్మకు మానవ శరీరం కూడా ఒక రథమే) సుందరంగా సృష్టించి, ఆ రథాంగాలైన కీలక చక్ర సూత్రాలను చేతిలోనే అట్టిపెట్టుకున్న రమ్య "రథాంగ పాణి" మన వేంకట రమణుడు.

స్వామివారి ఉత్సవ రథాన్ని రంగురంగుల పూల మాలలతోనూ, ద్వార పాలకులు, అశ్వనీ దేవతా మూర్తులతోనూ, పైన స్వర్ణకలశం మీద అదే రంగు గొడుగుతోనూ సర్వాంగశోభితంగా అలంకరిస్తారు. ఇక మలయప్పస్వామి వారిని, ఉభయ నాంచారులను అలంకరించే తీరు వర్ణనాతీతం. కనువిందు గావించే పట్టు వస్త్రాలు, సొగసు నగలు, సోయగాల పూలమాలలు, అబ్బో... అన్నీ అపురూపంగానే ఉన్నాయి.

కాగా.. శుక్రవారం శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై ఊరేగాడు. చల్లని చూపులు వెదజల్లే చంద్రుడిని తన వాహనంగా చేసుకుని నవనీత చోరుని అలంకారంలో శ్రీనివాసుడు భక్త జనులకు కనువిందు చేశాడు. ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించి తేజో విరాజితుడై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే.. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నాలుగు మాడా వీధుల్లో శ్రీవారు విహరించారు. ఇటీవల టీటీడీ తయారు చేయించిన బంగారు చంద్రప్రభ వాహనాన్ని ఈ సేవకు వినియోగించారు.

రాత్రి 9 గంటలకు స్వామివారి చంద్రప్రభ వాహనసేవ ప్రారంభమైంది. ముందు బ్రహ్మ రథం సారథ్యం వహించగా, గో, గజ, తురగ తదితర పదాతి దళాలు అనుసరించాయి. నాలుగు తిరువీధుల్లో వేలాది మంది భక్తులు స్వామి వారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి