చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఆదివారం (23వ తేదీతో) ముగిసాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలవరకు శ్రీవారి చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత శ్రీదేవి, భూదేవి సమేత వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చూర్ణాభిషేకానికి అనంతరం పల్లకిలో అలంకృతమైన స్వామివారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక చింతనను ప్రబోధించింది. ఊరేగింపుగా వచ్చిన ఉత్సవమూర్తులు వరహా ఆలయం వద్దకు చేరుకోగా, వరాహ పుష్కరిణి వద్ద ఉన్న నీటిలో సుదర్శన చక్రానికి స్నానం చేయించారు. ఈ సమయం కోసం వేచిఉన్న వేలకొలది భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు.

సుదర్శన చక్రాన్ని నీట ముంచిన ఆ జలంలో స్నానమాచరిస్తే సర్వపాపాలు రుగ్మతలు తొలగి పోతాయనే ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవమైన ధ్వజ అవరోహణం వైభవంగా జరిగింది.

వెబ్దునియా పై చదవండి