ముత్యాల పందిరిపై మలయప్ప స్వామి

WD PhotoWD
బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు ఉదయం సింహవాహనంపై ఊరేగిన శ్రీవేంకటేశ్వరుడు ఈ సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఈయనున్నాడు. కాళీయ మర్దనుడైన బాలకృష్ణునిగా యోగ సాధకులకు గోచరించే దివ్యజ్ఞానమైన ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమీయనున్నారు.

ఏడుకొండలను ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే సర్వపాపాలు తొలగుతాయి. కలియుగంలో ప్రజల ఆర్తిని బాపి, వారిని తరింప చేయటానికి శ్రీ మహా విష్ణువు వైకుంఠాన్ని వీడి వేంకటాచలాన్ని చేరి, అక్కడి ఆనంద నిలయ దివ్యవిమానం కింద కొలువై ఉన్నారు. అందుకే తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠమైనది. ఆ స్వామి నేడు మలయప్ప స్వామిగా భక్తులకు కనులారా దర్శనమిస్తున్నాడు.

అధిష్ఠాన దైవం ప్రతినిధిగా వివిధ ఉత్సవ సమయాలలో విశేష పూజలను అందుకుంటూ, ఊరేగింపు సందర్భంగా అసంఖ్యాక భక్తుల వందనాలు, సమర్పణలు అందుకుంటూ వారి సాధక బాధకాలను ఓపిగ్గా వింటూ... తాను సదా అండగా ఉన్నానంటూ అభయాన్నిచ్చే స్వామి శ్రీ మలయప్ప స్వామి.

గర్భగుడి వరకూ వచ్చి తన దర్శనం చేసుకొన అవకాశం లేని వృద్ధులు, అస్వస్థులు, చిన్నపిల్లల కోసమై తానే స్వయంగా బయటకు వచ్చి ఊరేగుతూ దర్శన భాగ్యం ప్రసాదించే దివ్యమూర్తి మలయప్ప స్వామి.

వెబ్దునియా పై చదవండి