సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు

మంగళవారం, 16 అక్టోబరు 2007 (17:11 IST)
తిరుమలలో జరుగుతున్న వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం స్వామి వారు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. భూపాలకులందరికీ తామే నాయకుడని, రాజులకు అధికారం తమ వల్లే సిద్ధిస్తుందని ప్రవచిస్తూ స్వామివారు మాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులను కనువిందు చేసింది. శ్రీదేవీ, భూదేవీ సమేత సర్వాలంకార భూషితుడైన శ్రీవారు సర్వభూపాల వాహనంపై ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు.

సర్వభూపాల వాహన సేవకు పూర్వం సోమవారం ఉదయం కల్పవృక్షవాహనంపై దేవతా తరువు, కామధేనువులతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజైన మంగళవారం ఉదయం మోహినీ అవతార సేవ జరుగనుంది. మంగళవారం రాత్రి 9.00 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవాల్లో విశిష్ట సేవగా పరిగణించబడే గరుడవాహన సేవ జరుగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రతిష్ఠాత్మక గరుడవాహన సేవలో పాల్గొని శ్రీవారి దర్శనాన్ని పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి