సూర్యవాహనంలో ఊరేగిన వెంకయ్య

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏడో రోజైన శుక్రవారం మలయప్ప స్వామి సూర్యవాహనంలో ఊరేగారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు చంద్ర ప్రభ సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలి నాళ్ళలో స్వామివారు పశుపక్ష్యాదులు, భూపాలురను వాహనాలుగా మలచుకుని తిరువీధుల్లో ఊరేగగా.. సప్తమ దినాన సూర్యచంద్రులను సైతం తన వాహనాలుగా చేసుకుని తిరువీధుల్లో ఊరేగడం విశేషం. సూర్యుని వంటి ప్రకాశవంతమైన తేజస్సుతో స్వామివారు మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు వేంచేశారు.

ఇదిలావుండగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి శ్రీనివాసుడు ఉభయ నాంచారులతో స్వర్ణరథంపై ఆధిరోహించి నాలుగు మాడా వీధుల్లో ఊరేగారు. తిరువీధుల్లో మలయప్ప స్వామి వారి రథ రంగడోలోత్సవం శ్రీవారి రాజవైభవాన్ని చాటుతూ లోకరక్షణధ్యేయాన్ని అవిష్కృతం చేసింది. సుమారు తొమ్మిదేళ్ళ క్రితం వరకు గోవర్థన గిరినెత్తిన శ్రీకృష్ణుని స్వర్ణ రథోత్సవం స్థానంలో ఊరేగించేవారు.

ఆ తర్వాత స్వర్ణ రథాన్ని సిద్ధం చేయడంతో నాంచారులను ఆయన చెంత చేర్చి రథ రంగడోలాత్సవాన్ని దాని స్థానంలో ప్రవేశపెట్టారు. రంగనాయకుని మండపంలో ఉత్సవమూర్తులకు వేదపండితులు విశేష సమర్పణ గావించడంతో రథ రంగ డోలోత్సవం శుభారంభమైంది. ఈ స్వర్ణ రథోత్సవ సేవలో ఎక్కువ సంఖ్యంలో మహిళలు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు.

వెబ్దునియా పై చదవండి