కృష్ణాష్టమి వేళ దేవదేవుని ప్రార్థిద్ధాం రండి

శనివారం, 23 ఆగస్టు 2008 (13:27 IST)
హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మహా విష్ణువు అవతారమైన ఆ దేవదేవుని ప్రార్థిస్తే మానవ జన్మ సార్థకమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

గోకులంలో జన్మించి లోక కంటకులైన అతి భయంకర రాక్షస వీరులను సంహరించి లోక కళ్యాణానికి కృషి చేసిన శ్రీకృష్ణుని చరితం మానవజాతి మొత్తానికే ఆదర్శప్రాయం. ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ కోసం అవతరించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన కృష్ణాష్టమి వేళ ఆయనను మనసా వాచా కర్మణా ధ్యానించి పూజిస్తే ఇహ పర సౌఖ్యాలు మన సొంతమౌతాయి.

అయితే కృష్ణాష్టమి వేళ ఆ చిన్ని కృష్ణుని ఎలా పూజించాలి అని మీరు ఆలోచించాల్సిన పనిలేదు. ఇక్కడ చెప్పిన విధంగా చేసి కృష్ణుని పూజించగల్గితే సకల శుభాలు మీ ముంగిటికొస్తాయి. కృష్ణాష్టమి వేళ ఉదయాన్నే ఐదు గంటలకే లేచి తలస్నానము పూర్తి చేయాలి. అనంతరం పసుపు రంగు బట్టలు ధరించాలి.

అలాగే ఇంటినీ, పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరచాలి. ఇంటి గడపకు పసుపు, కుంకుమను అలంకరించి గుమ్మానికి మావిడాకుల తోరణాలు కట్టాలి. అటుపై పూజా మందిరాన్ని చక్కని ముగ్గులతో అలంకరించాలి. అనంతరం పూజాగదిలో పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అక్కడ రాధా సమేతుడైన కృష్ణ భగవానుడి పటాన్ని పెట్టాలి.

కృష్ణుని పటం ముందు కలశాన్ని ఏర్పాటు చేసి దానిని పసుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. కృష్ణుని పటాన్ని సన్నజాజుల మాలతో అలంకరించాలి. పూజకోసం కదంబ పుష్పాలను ఉపయోగించాలి. అలాగే శ్రీకృష్ణుడికి నైవేద్యం కోసం పానకం, వడపప్పు, కమలాకాయలను సిద్ధం చేయాలి.

ఇవన్నీ సిద్ధం చేసిన అనంతరం కదంబ పుష్పాలతో శ్రీకృష్ణుని పూజిస్తూ శ్రీకృష్ణాష్టకాన్ని పఠిస్తే ఆ దేవదేవుడు కోరిన వరాలిచ్చి తన భక్తులకు సుఖశాంతులను ప్రసాదిస్తాడు.

వెబ్దునియా పై చదవండి