శ్రీకృష్ణ జయంతి పూజా విధానం..

PNR

FileFILE
కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటిలో "తులసీదళము"లను ఉంచి సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారు. ఆ రోజు సర్వులు వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతారు.

ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో పూజించి, ధూపదీప నైవేద్యములతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలాలు సమర్పించుకొనుట ఎంతో మంచిదని చెపుతుంటారు. అంతేకాక చాలాచోట్ల కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః||
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||

ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలనే కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహస'ను శతృఅభేద్యమైన "నీపాద పద్మ వజ్రపంజర" మందు ఉంచుతున్నాను తండ్రీ...!

ఇట్టి పరమ పుణ్యదినమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమినాడు విశేషార్చనలు జరిపించుకుని కృష్ణ భగవానుని ఆశీస్సులతో పునీతులమవుదాము. ఈ శుభవేళ చేయాల్సిన పూజా ఒకసారి పరిశీలిద్ధాం.

ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేవాలి. పూజాగదిని, ఇంటితో పాటు పరిసరాలను శుభ్ర పరచుకోవాలి.
ఇంటి గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని అలంకరించి, ముగ్గులు వేయాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి, పసుపు వర్ణంలో ఉండే పట్టు వస్త్రాలను ధరించాలి. పూజకోసం.. దేవదేవుని చిత్రపటాన్ని గంధము, పసుపు కుంకుమతో అలంకరించాలి.

పూజా మందిరంలో పసువు రంగు వస్త్రాన్ని పరిచి, కలశముపై ఇదే వర్ణంతో కూడిన వస్త్రాన్ని పరచాలి. శ్రీకృష్ణుడు, రాధ చిత్రపటాలు కలిసి వుండేలా చూసుకోవాలి. పూజకు అవసరమైన పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పాలు, సన్నజాజులు మాల, పానకం, వడపప్పు, కమలా పండ్లును పూజలో ఉపయోగించాలి.

పూజలో శ్రీకృష్ణ అష్టోత్తరం, శ్రీకృష్ణాష్టకంను పారాయణం చేయాలి. అలాగే.. ఇతర స్తోత్రాలలో బాలకృష్ణా స్తోత్రమ్ శ్రీకృష్ణ సహస్రనామము, శ్రీమద్భాగవతము, దశమ, ఏకాదశ స్కంధ అధ్యాయాలను పఠిస్తే మంచిది. పూజానంతరం.. శ్రీకృష్ణదేవాలయము, గౌడీయామఠంను దర్శించే పుణ్యం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి