నవమి రోజున రామాలయాలకు వెళ్లండి

WD
శ్రీరాముడు జన్మించిన రోజుగా పరిగణించే శ్రీరామ నవమి రోజున సీతారామ, లక్ష్మణ సమేత రామాలయాన్ని సందర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఇదే రోజున రామాలయానికి వెళ్లి నిష్టతో స్వామిని ప్రార్థించుకుని, ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగించినట్లైతే పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం.

శ్రీరామ ఆలయాల్లో జరిగే సీతారామ కళ్యాణాన్ని నవమి రోజున తిలకించే భక్తులకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. శ్రీ సీతారామ పట్టాభిషేకము, సీతారామ కళ్యాణాన్ని ఆలయాల్లో నిర్వహించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే.. శ్రీరామ చంద్రుని ఆలయాల్లో ప్రసిద్ధి గాంచిన భద్రాచలం, ఒంటి మెట్ట, గొల్లల మామిడాడ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే పాపాలు తొలగి పోతాయి. అదేవిధంగా.. శ్రీరామ దేవాలయాలకు వచ్చే భక్తులకు పానకం తీర్థాన్ని దానం చేస్తే కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే.. మీ ఇంటికి నవమి రోజున వచ్చే ముత్తైదువులకు శ్రీ రామ రక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలములతో కలిపి ఇస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుందని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి