చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమసాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మథురా నగరిలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లెకు తీసుకువెళ్లి నంద, యశోదలకు అప్పగించారు. ఎంతైనా రాజకుమారుడు కదా! ముఖంలోని గంభీరం, వెలుగు, రాజఠీవి ఎంత దాచినా దాగవుగా. అందమైన ఆ మోము చూసి ఆకర్షితులుకాని వారు ఉండరు.
బాల్యంలో శ్రీకృష్ణుడి లీలలు అంతా ఇంతా కాదు. తనను సంహరించేందుకు వచ్చిన అనేకమంది రాక్షసులను వెన్నదొంగ అవలీలగా అంతమొందించాడు. తన మిత్రులతో ఆడుకునే సమయంలో ఎదురైన అనేక అపాయాలను సులభంగా తప్పించాడు. దీనితో సంతోషించిన మిత్ర బృందం కృష్ణుని తమ బృందానికి నాయకుడిగా చేశారు. తమ ప్రియమైన మిత్రునికి ఏదైనా చేయాలని వారు భావించారు.