ఇప్పుడు ఏ చిన్న కార్యక్రమం జరుగుతున్నా డీజేను ఏర్పాటు చేసి విపరీతమైన శబ్దం చేయడం సాధారణమైపోయింది. డీజే శబ్దం వల్ల ఇటీవలి కాలంలో పలువురు గుండెపోటుతో మరణించిన కేసులు కూడా వచ్చాయి. తాజాగా డీజే శబ్దం ధాటికి ఏకంగా ఓ గోడ కూలిపోయిందంటే ఆ శబ్ద తీవ్రత ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు.
శ్రీకాకుళం జిల్లాలోని భవానీపురం నందన్న గౌరమ్మ ఉత్సవాల ఊరేగింపు సందర్భంగా డీజే ఏర్పాటు చేసారు. భారీగా శబ్దం చేసుకుంటూ ఊరేగింపుగా వస్తుండగా ఆ శబ్దానికి అకస్మాత్తుగా రోడ్డుకి పక్కనే వున్న కాంక్రీట్ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.