పసందైన బియ్యం పిండి "పోకుండలు"

FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం... రెండు కప్పులు
బెల్లంపొడి... ఒక కప్పు
తెల్లనువ్వులు... 4 టీ.
నెయ్యి... రెండు టీ.
ఎండుకొబ్బరి ముక్కలు.. గుప్పెడు
యాలకులపొడి... ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగి నీటిని వంపేసి పొడిబట్టమీద నీడలో ఆరబెట్టాలి. గంటసేపు అలా ఆరిన తరువాత వాటిని మిక్సీలో వేసి పిండి చేసి జల్లించి పక్కన ఉంచాలి. నువ్వుపప్పును నూనె లేకుండా దోరగా వేయించి పక్కనుంచాలి. అదే కడాయిలో నెయ్యి వేసి ఎండుకొబ్బరి ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించి ఉంచాలి.

ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో బెల్లంపొడి వేసి పావుకప్పు నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి కలుపుతూ ఉండాలి. కాసేపటి తరువాత పాకం ఉండకడుతుండగా యాలకులపొడి, వేయించిన కొబ్బరి ముక్కలు, నువ్వుపప్పు, బియ్యంపిండి పోసి కలుపుతూ ఉండాలి. ముద్దగా అయ్యేంతదాకా బియ్యంపిండి పోస్తూ ఉండాలి.

కడాయిలో నూనె పోసి స్టవ్‌మీద పెట్టి నూనె కాగనివ్వాలి. ఈలోగా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రంగా చేసి కాగిన నూనెలో వేసి వేయించాలి. ముదురు గోధుమరంగులోకి మారాక వీటిని తీసి, చల్లారాక గాలిచొరని డబ్బాలో భద్రపరిస్తే పదిహేను రోజులదాకా నిల్వ ఉంటాయి. అంతే బియ్యం పోకుండలు రెడీ...!!

వెబ్దునియా పై చదవండి