ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్లో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ ధాటికి పసికూన స్కాంట్లాండ్ జట్టు బెంబేలెత్తింది. బ్యాట్స్మెన్ చెలరేగి ఆడటంతో ఈ మ్యాచ్లో స్కాట్లాండ్పై ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. రైడర్ (31) టేలర్ (21) కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
స్కాట్లాండ్ ఉంచిన 90 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను ఏడు ఓవర్లకే కుదించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 7 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 89 పరుగులు సాధించింది.
ఓపెనర్లు వాట్సన్ (27), పూనియా (27), కొట్జెర్ (33) ధాటిగా ఆడటంతో స్కాట్లాండ్ జట్టు ప్రత్యర్థి ముందు బలమైన లక్ష్యాన్ని ఉంచింది. అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ప్రారంభం నుంచి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకపడటంతో ఈ లక్ష్యం వారి ముందు చిన్నబోయింది. బౌలర్ల అనుభవలేమి, ఫీల్డింగ్ లోపాలు స్కాట్లాండ్కు శాపాలయ్యాయి. మూడు వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.