సెమీస్‌లో సఫారీ బోల్తా: ఫైనల్స్‌లో పాక్

దక్షిణాఫ్రికాను సెమీస్ దురదృష్టం మరోసారి వెంటాడింది. కీలకమైన మ్యాచ్‌లను ఒత్తిడికిగురై చేజార్చుకునే దక్షిణాఫ్రికా గురువారం పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఈ పోరులో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయం సాధించి వరుసగా రెండోసారి ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది.

చేతిలో 5 వికెట్లున్నా... దక్షిణాఫ్రికాకు 7 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. తొలి ప్రపంచకప్‌లోనూ సెమీస్ నుంచి ఇంటిముఖం పట్టిన దక్షిణాఫ్రికా మళ్లీ ఇక్కడే బోల్తా కొట్టింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ నిర్ణీత 20 ఓవర్లలో 142/5 స్కోరే చేయగలిగారు. కలీస్‌ (64) ఒంటరి పోరాటం వృథా అయింది. డుమిని (44 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశాడు.

40 పరుగుల వరకు వికెట్ కోల్పోని దక్షిణాఫ్రికా అనంతరం మరో పది పరుగుల వ్యవధిలో స్మిత్ (10), గిబ్స్ ‌(5), డివిలియర్స్‌ (1) వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో చిక్కుకుంది. ఆఫ్రిది ఆల్‌రౌండ్ ప్రతిభతో పాక్ జట్టును ఫైనల్స్‌లో నిలబెట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్‌ కమ్రన్‌ అక్మల్‌ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. దీనిని ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌లు కొనసాగించారు. అఫ్రిది 32 బంతుల్లో (51) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మరోవెపు షోయబ్‌ మాలిక్ (34) కుదురుగా ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి