ఒత్తిడిని అధిగమిస్తాం: మహేంద్ర సింగ్ ధోనీ

ఇంగ్లాండ్‌లో త్వరలో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఇతర జట్ల కంటే టీం ఇండియా ఒత్తిడిని బాగా తట్టుకోగలదని జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తమకు ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

ఐపీఎల్ కారణంగా జట్టు ఆటగాళ్లు ట్వంటీ- 20 క్రికెట్‌లో ఒత్తిడిని అధిగమించడంలో బాగా తర్ఫీదు పొందారని చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లు ఇతర జట్లలోనూ ఉన్నప్పటికీ, తమ జట్టు ఆటగాళ్లదే పైచేయి అన్నాడు. టీం ఇండియాలోని అందరు ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. జూన్ 5 నుంచి ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న టీం ఇండియాలోని 15 మంది ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్వంటీ- 20 టోర్నీలో ఆడారు. ఈ నేపథ్యంలో ధోనీ మాట్లాడుతూ.. చివరి ఓవర్‌లో 10 లేదా 15 పరుగులు కావాల్సిన సమయంలో తమ జట్టులో దాదాపుగా అందరికీ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి