ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని కెన్నింగ్టన్ ఒవెల్‌లో జరిగిన గ్రూపు బి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆతిథ్య ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యానికి బదులుగా పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది.
ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు తరువాతి రౌండు ఆశలు సజీవంగా ఉంచుంకుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్‌తో జరిగే గ్రూపు బి చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూపు బి ప్రారంభ మ్యాచ్‌లో నెదర్లాండ్ జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌పై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. ఓపెనర్ సల్మాన్ బట్ (28), షోయబ్ మాలిక్ (20), కెప్టెన్ యూనిస్ ఖాన్ (46 నాటౌట్) జట్టును విజయంవైపు నడిపేందుకు విఫలయత్నం చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రైట్, స్వాన్, మాస్కరెన్హాస్, ఆండర్సన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఓపెనర్ రైట్ (34, 16 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్), కెవిన్ పీటర్సన్ (58, 38 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఓవియాస్ షా (33) పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన రైట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.