తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 1.12 గంటలకు మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారం 10 రోజులు లేదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సూచనలు ఉన్నట్టు సమాచారం.
కాగా, తెరాస శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను 88 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. కేసీఆర్ ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా, మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 88 స్థానాల్లో గెలిచి, స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. అంతకుముందు రాష్ట్ర సీఈవో రజత్‌కుమార్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను అందించారు. ఎన్నికల కమిషన్ గెజిట్‌ను గవర్నర్ ఆమోదించారు.
ఇదేక్రమంలో ప్రస్తుత ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, ఆయన మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. అనంతరం కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి, కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు తెలియజేస్తూ తీర్మాన ప్రతిని అందజేశారు.
గవర్నర్‌వద్దకు వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గొంగిడి సునీత, పద్మాదేవేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీందర్, రేఖానాయక్ తదితరులున్నారు.