కెసిఆర్‌ను నేను ఏమీ అనలేను... అలాగైతే వస్తా... ఎన్టీఆర్?

గురువారం, 29 నవంబరు 2018 (21:18 IST)
అక్క సుహాసినికి మద్ధతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి కాస్త సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సుహాసిని తరపున పోటీ చేసేందుకు బాలక్రిష్ణ ఇప్పటికే డేట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కూకట్‌పల్లిలో పర్యటించి సుహాసినికి ఓటెయ్యమని కోరనున్నారు బాలక్రిష్ణ. 
 
అయితే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు ఇద్దరూ తమ పర్యటనను ఖరారు చేసుకున్నారట. అక్క సుహాసిని రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రస్తుతం సరైన వేదిక అని.. అందుకే ఆమెను గెలిపించడానికి నందమూరి, నారా కుటుంబం మొత్తం కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంలో ఉన్నారట. కొన్నిరోజులకు ముందే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు ప్రచారం చేస్తారని అందరూ భావించారు. కానీ బాగా ఆలోచించుకుని ఎవరిపైనా విమర్శలు చేయకుండా ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి జూనియర్ వచ్చేశారట.
 
కారణం.. తన తండ్రి హరిక్రిష్ణ.. కెసిఆర్‌కు మంచి స్నేహితుడు. అంతేకాదు ఆయన మరణించినప్పుడు 400 గజాల స్థలాన్ని స్మారక స్థూపం కోసం కూడా కేటాయించారు. దీంతో కెసిఆర్‌ను విమర్శించకుండా కేవలం ఓటు వేయమని మాత్రమే ప్రచారం చేయడానికి అయితే వస్తానని జూనియర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసినికి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నువ్వు ప్రచారానికి వస్తే చాలని, ఎవరినీ విమర్శించాల్సిన అవసరం లేదని కూడా సుహాసిని చెప్పిందట. దీంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు ఇద్దరూ కూడా అక్క తరపున ప్రచారం చేయడానికి డిసెంబర్ మొదటి వారంలో ప్లాన్ చేసుకుంటున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు