ప్రచార హోరు.. హేమాహేమీల జోరు :: ఒకే వేదికపై రాహుల్‌ - చంద్రబాబు

బుధవారం, 28 నవంబరు 2018 (09:55 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఫలితంగా ప్రచార హోరు ఉధృతంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో హేమాహేమీలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా, బుధవారం వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రచారానికి తరలిరానున్నారు. 
 
వాస్తవానికి ఇప్పటికే తెరాస అధినేత కేసీఆర్‌ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బుధవారం ఆయన ఏకంగా ఆరు నుంచి ఎనిమిది సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే, మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిలతో పాటు భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ బుధవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. 
 
రాహుల్ గాంధీ ఉదయం 11.30 గంటలకు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలు పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, రాత్రి 7.15 గంటలకు అసిఫ్ నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సమయంవున్నట్టయితే వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉదయం 11 గంటలకు నిర్మల్ సభలో, మధ్యాహ్నం 1 గంటలకు మంచిర్యాలజిల్లా శ్రీరాంపూర్‌లో పర్యటిస్తారు. అలాగే, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యాహ్నం 3 గంటలకు కీసరలో జరిగే బీజేపీ సభలో పాల్గొంటారు. వీరితో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు