పదవులిస్తే సైలెంట్ అవుతరు మన సన్నాసులు: కేసీఆర్

శనివారం, 7 జనవరి 2012 (21:00 IST)
కుక్కలకు బొక్కలేసినట్లు మన ప్రాంత నాయకులకు పదవులిస్తే సైలెంటవుతరని తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణ ప్రాంత నాయకులను విమర్శించారు. పదవులకు రాజీనామా చేయని ఇక్కడి నాయకులు దద్దమ్మలు, సన్నాసులు అనీ, ఇంకా ఈ మాటలకంటే ఎక్కువైన పదాలేమైనా ఉంటే అవి వారికి వర్తిస్తాయని మండిపడ్డారు.

తెలంగాణ లెక్చరర్ల డైరీ ఆవిష్కరణ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణలోని అన్ని వనరులను సీమాంధ్ర పాలకులు దోచుకుంటూనే ఉన్నారన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావన్నారు. చంద్రబాబు ఏదో చేస్తానని రాళ్లు నాటి పోతే.. వైఎస్సార్ వచ్చి మొక్కలు నాటిండు.. అంతే తప్ప తెలంగాణకు మాత్రం నీళ్లు రాలేదు.

మిగులు జలాలను తరలించుక పోతూనే ఉంటుండ్రు. మన ప్రజాప్రతినిధులు దద్దమ్మలు కాబట్టే సీమాంధ్రుల నిర్వాకం సాగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. సీమాంధ్రులు చిట్టచివరి వరకూ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తూనే ఉంటారనీ, కనుక ఎవరూ ఎటువంటి తికమకలకు గురి కాకుండా తెలంగాణ లక్ష్యంగా ముందుకు ఉరకాలని పిలుపునిచ్చారు.

ఇక తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీకి ఇక నుంచి ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసే చిల్లర రాజకీయాలు ఇక నుంచి చెల్లవన్నారు. ప్రజాక్షేత్రంలో తెదేపా భూస్థాపితం కావడం ఖాయమన్నారు.

వెబ్దునియా పై చదవండి