గత నెలలో వరంగల్‌లో జరిగిన ఒక సభలో తెలంగాణ సంస్కృతిని కించపరిచే జర్నలిస్టుల మెడలు విరుస్తానని, భూమిలో పాతిపెడతానని, ఇక్కడి ప్రజలకు సెల్యూట్ చేయాల్సిందే వంటి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై పీసీఐకి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.
దీంతో మీడియా ఎదుర్కొంటున్న సమస్యపై విచారణకు పాత్రికేయులు రాజీవ్ రంజన్ నాగ్, కె.అమర్‌నాథ్, కృష్ణప్రసాద్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ నియమించారు. ఈ కమిటీ విచారణ అనంతరం సోమవారం తన నివేదికను పీసీఐకి సమర్పించింది. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు కమిటీ తేల్చి చెప్పింది. ముఖ్య మంత్రి వ్యాఖ్యలు పత్రికా స్వేచ్ఛను హరించేవిధంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
కేసీఆర్ బెదిరింపు వ్యాఖ్యలపై మందలించాలని కేంద్రాన్ని కోరింది. నిరసనల సందర్భంగా జర్నలిస్టులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. జర్నలిస్టులపై దాడిచేసిన పోలీసులపై, హైదరాబాద్, వరంగల్‌లో మహిళా జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.