ఉద్వాసనకు తర్వాత కేసీఆర్‌తో రాజయ్య భేటీ!

మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (08:51 IST)
తెలంగాణ మంత్రివర్గం నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత రాజయ్య తొలిసారి సీఎంతో సమావేశం కావడం గమనార్హం. కేసీఆర్‌ను క్యాంప్ ఆఫీసులో కలిశారు.
 
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఆ తర్వాత రాజయ్య ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింటుమెంట్ లభించలేదు. ఇప్పుడు ఆయన కలిశారు. అయితే, ఈ భేటీ వెనుక ఏదో మతలబు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
తనకు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వస్తే కలుస్తానని రాజయ్య కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనే కలిశారా లేక కేసీఆర్ పిలిచారా అనే చర్చ సాగుతోంది. అయితే, రాజయ్యనే కలిసి ఉంటారంటున్నారు. కాగా, కేసీఆర్‌ను కలిసిన అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి