కాంగ్రెస్ అధిష్టానం మాటకోసం కేసీఆర్ గప్చిప్... 30న హీరోనా..?! జీరోనా..?!!
సోమవారం, 24 సెప్టెంబరు 2012 (22:05 IST)
FILE
తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిందా పార్టీ. ఆ పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సమర్థవంతంగా నడుపుతూ గులాబీ సుమాలను గుభాళించిన మహా మేటి రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇప్పుడాయన ఢిల్లీకి వెళ్లి 20 రోజులు కావొస్తోంది. ఆగస్టు లోపే ప్రకటన వచ్చేస్తోంది... సెప్టెంబరు మార్చ్ ఎందుకూ అంటూ చిందులేసిన కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లు..? అసలక్కడ ఏం జరుగుతోంది..? విలీనమా...? తెలంగాణమా..?
ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ తెస్తానంటూ బజాయించి చెప్పిన కేసీఆర్ మౌనముద్రలో ఉండటమే కాకుండా ఉద్యమ సెగ వేడిపుట్టిస్తున్న ఈ తరుణంలో మీడియా ముందుకు కూడా రావడం లేదు. దీనిపై పలు ఊహాగానాలు జోరందుకున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ కు ఇదమిత్థమయిన హామీ ఇచ్చిందనీ, సీమాంధ్ర నాయకులను ఒప్పించే పనిలో ఉన్నదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎంత చెప్పినా పెడచెవిన పెడుతున్న టి.కాంగేయులను వదిలించుకుని తెరాసను తెలంగాణలో బాగా యాక్టివ్ చేయడం ద్వారా 2014 నాటికి అనుకున్న కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉందన్న వార్తలు జోరందుకున్నాయి. పైగా ఇంత జరుగుతున్నా... కేసీఆర్ ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకపోవడం వెనుక కారణం... కీలకమయిన చర్చలు జరుగుతున్నాయంటున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఏమీ జరక్కపోతే కేసీఆర్ ఢిల్లీలో అన్ని రోజులు ఎందుకుంటారూ.. అంటూ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు... సీమాంధ్ర నాయకులు హడావుడి ఢిల్లీ ప్రయాణాలు ఇంకోవైపు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంకా ఎంతో దూరంలో లేదన్న వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు తెలంగాణా ఐకాస ఛైర్మన్ కోదండరామ్... కేసీఆర్ మధ్య ఉప ఎన్నికల దగ్గర్నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్న చందంగా పరిస్థితి మారిపోయింది.
ఈ నేపధ్యంలో కేసీఆర్... తమను కాదని నిర్ణయాలను తీసుకుంటున్న జేఏసీలను చావుదెబ్బ కొట్టాలన్న కృతనిశ్చయంలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రాన్ని తన చేతుల మీదుగా ఏర్పాటు చేసి, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సైతం సిద్ధమయిపోయారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద సెప్టెంబరు మార్చ్, కేసీఆర్కు పెద్ద సవాల్ లాంటిదే. మార్చ్ అవసరం లేదని ప్రకటించినా... టిజేఏసీలు పంతంబూని చేస్తున్న ఈ మార్చ్ కు ముందే కేసీఆర్ తన మాటను నిలబెట్టుకుని హీరో అవుతారా.. లేక ప్రకటన చేయించలేక జీరో అవుతారో చూడాలి.