5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఠాగూర్

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:50 IST)
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీలోని విజయవాడ నగరంతో పాటు తెలంగాణాలో ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తెలంగాణాలోని ఎనిమిది రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేసింది.
 
వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సెలవులు పెట్టొద్దని, ప్రజలకు సేవలందించడంపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. 
 
కాగా, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు సెలవుల విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టరు ఆదేశించారు.
 
ముఖ్యంగా, తెలంగాణాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మొత్తం 11 జిల్లాల్లో మోస్తరుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు