ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతూ వచ్చిన నాలుగు రైళ్లను ఇక నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేలా మార్చారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.720 కోట్ల వ్యయంతో ఆధునకీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ పనులతో పాటు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.
ఆ ప్రకారంగా ఇక నుంచి తిరుపతి - ఆదిలాబాద్ ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26వ తేదీ నుంచి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి రాత్రి 9.14 గంటలకు బొల్లారం స్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి ఈ రైలు ఉదయం 4.29 గంటలకు బొల్లారంకు, ఉదయం 5.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
అలాగే, కాకినాడ - లింగంపల్లిల మధ్య నడిచే ప్రత్యేక రైలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.