వందే భారత్ వేగం పెంచారు.. ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గింది...
గురువారం, 21 డిశెంబరు 2023 (10:49 IST)
దేశంలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ఒకటి. ప్రస్తుతం ఈ రైలు వేగాన్ని పెంచారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 15 నిమిషాల మేరకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడ రైల్వే స్టేషనులో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. అంటే ప్రయాణ సమయం 8.30 గంటలు.
ప్రస్తుతం ఈ రైలు వేగాన్ని పెంచారు. దీంతో ఈ రైలు ఇకపై కాచిగూడ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్‌లో 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 నిమిషాలకు కాచిగూడకు గతంలో చేరుకునేది. కానీ ఇపుడు ఈ రైలు రాత్రి 11 గంటలకే చేరుకుంటుంది. అంటే 15 నిమిషాలు ముందుగానే చేరుకుంటుంది. అలాగే, కాచిగూడలో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుంది. ప్రస్తుతం ఈ రైలు మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం మీదుగా బెంగుళూరు యశ్వంత్ పూర్‌కు చేరుకుంటుంది.
కారులో గ్యాస్ లీక్... షికాగోలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి
అమెరికాలో తెలుగు యువతి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కారులో గ్యాస్ లీక్ కావడంతో ఆమె చనిపోయింది. ఈ విషాదకర ఘటన షికాగోలో జరిగింది. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఈ యువతి ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడు ప్రాంతానికి చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజియోథెరపీలో డిగ్రీ చేశారు. ఈ యేడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయింది.
దీంతో డ్రైవర్‌తో పాటు నాజ్ కూడా స్పృహ కోల్పోయారు. ఆ వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా, జహీరా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ, తమ కుమార్తె మృతదేహం స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడుతున్నారు.
వామ్మో... ఇదేం తాగుడు రా బాబోయ్... లిక్కర్ వినియోగంలో తెలంగాణ టాప్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పేరిగిపోయాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళకు మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే దక్షిణాదిలో లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతోందని తెలిపారు.
గత 2011వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ.. మద్యం అమ్మకాలు తక్కువగా ఉండగా, తెలంగాణలో మాత్రం జనాభా తక్కువ.. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
అయితే, తాజాగా ఎక్సెజ్ అధికారులు వెల్లడించిన నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా 4.93 కోట్లు. 2022-23లో అక్కడ 3.35 కోట్ల లిక్కర్ (ఐఎంఎల్) కేసులు అమ్ముడుపోయాయి. దీనినిబట్టి అక్కడ తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. 1.16 కోట్ల కేస్ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే తలసరి బీర్ల వినియోగం 1.86 లీటర్లు.
తమిళనాడులో తలసరి మద్యం వినియోగం 7.66 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 3.75 లీటర్లు. ఇక, తెలంగాణతో దాదాపు సమాన జనాభా కలిగిన కేరళలో తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు కాగా, బీర్ల వినియోగం 2.63 లీటర్లు.
ఇపుడు తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ తలసరి మద్యం వినియోగం 9 లీటర్లుగా, బీర్ల వినియోగం 10.7 లీటర్లుగా ఉంది. లిక్కర్ వినియోగంలోనే కాదు, ఆదాయంలోనూ రాష్ట్రం టాప్ ఉంది. 2022-23లో తెలంగాణలో రూ.33,268 కోట్ల ఆదాయం వస్తే, ఏపీలో రూ.23,804 కోట్లు, కర్ణాటకలో రూ.29,790 కోట్లు, కేరళలో రూ. 16,189 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా సమకూరింది.
తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న మద్యం వినియోగాన్ని నియంత్రించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకాలను నియంత్రించాలని నిర్ణయించింది. బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. అలాగే, బార్లు, వైన్ ప్లపైనా నియంత్రణ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.