ఎంసీఆర్ హెచ్‌ఆర్డీఐకి తెలంగాణ సీఎం క్యాంపు తరలింపు

సోమవారం, 11 డిశెంబరు 2023 (09:58 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని మరో చోటికి తరలించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద ఉంది. దీనికి సమీపంలో ఉన్న మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎంసీఆర్ హెచ్ఆర్డీఐ) భవనంలోని తరలించాలని నిర్ణయించారు. ఈ భవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్వయంగా పరిశీలించారు. 
 
ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలనాపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్ నుంచి ఎంసీఆర్డీఐకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. 
 
తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రజాభవన్ సీఎం క్యాంప్ కార్యాలయంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మరో చోటుకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీఐలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి మార్చాలని, ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
పైగా, సోమవారం ఎంసీర్ హెచ్ఆర్డీఐ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీఐని సందర్శించి, అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అలాగే, ఇక్కడ ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
 
సీఎం క్యాంప్ ఆఫీసు ఎంసీఆర్ హెచ్ఆర్డీఐకి తరలిస్తే రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గరకానుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్తున్నారు. ఒకవేళ ఎంసీఆర్ హెచ్ఆర్డీఐకి క్యాంప్ ఆఫీస్‌ను మార్చితే దూరం చాలా వరకు తగ్గనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు