ఏ పదవిలో ఉన్నా.. ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలిని : ఎమ్మెల్యే సీతక్క
గురువారం, 7 డిశెంబరు 2023 (13:13 IST)
తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గ ప్రజలకు మాత్రం సేవకురాలినేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడ ఉన్నప్పటికీ తాను మాత్రం ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలినేనని ఆమె పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడ సంతోషంగా ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ బాధ్యతలు పెట్టారని చెప్పారు. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క తెలిపారు.
2004 నుంచి 2011 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ విధానాలను ఇపుడు కూడా అమలు చేస్తామని వివరించారు. సంక్షేమ పాలన అందించడంతో అన్ని వర్గాల మద్దతు తమకు కావాలని, అందరూ తమకు సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని సీతక్క చెప్పారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో జనం పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి గొప్పగా చూపించుకోవడం కాకుండా, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి నివాసం.. కార్యాలయం.. నియోజకవర్గంలో నిరంతర విద్యుత్ సరఫరా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంతో పాటు... ఆయన కార్యాలయం, ఆయన ప్రాతినిథ్యం వహించే కొడంగల్ నియోజకవర్గానికి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించగానే అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఉండే నివాసం, కార్యాలయం, ప్రాతినిథ్యం వహించే కొడంగల్ నియోజకవర్గానికి ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ సఫరా చేసే అంశంపై ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. ఇందుకోసం రెండు సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
గతంలో రేవంత్ నివాసానికి జూబ్లీహిల్స్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేది. అక్కడ ఏదైనా సమస్య తలెత్తినా విద్యుత్ సరఫరా ఆగకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోడ్ నంబర్ 22లోని సబ్ స్టేషన్ నుంచి కూడా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. కొడంగల్‌లో విద్యుత్ సరఫరాపై కూడా సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా గజ్వేల్‌లో విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
సామాన్య ప్రజల ప్రవేశానికి తెరుచుకున్న తెలంగాణ ప్రగతి భవన్ ద్వారాలు
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ప్రగతి భవన్ ఓ వెలుగు వెలిగింది. ఈ భవన్ సీఎం కేసీఆర్‌కు అధికారిక నివాసంగా ఉండేది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదు. ముందస్తుగా అనుమతి ఉంటేనే లోనికి అనుమతించేవారు. కానీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌లోకి ప్రతి సామాన్యుడికి కూడా ప్రవేశం కల్పిస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆయన ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ వద్ద పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన భద్రతా ఆంక్షలను పూర్తిగా తొలగించారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను తొలగించాలని ఆదేశాలు వెల్లడంతో పోలీసులు ఆ విధంగా చర్యలు చేపట్టారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించారు.
అంతేకాకుండా, ప్రగతి భవన్ ముందు ఉన్న బ్యారికేడ్స్ లోపలి నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ప్రగతి భవన్ పేరును కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్‍గా మార్చిన విషయం తెల్సిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రగతి భవన్‌తో పాటు సచివాలయం తలుపులు సామాన్య ప్రజలకు కూడా ఎపుడూ తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు.