తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ ఇంటర్‌లో 66.2 శాతం, ద్వితీయ ఇంటర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.4 కాగా.. బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది.
అలాగే, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,58,490 మంది (70.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78.65గా ఉండగా.. బాలురు ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.
అదేసమయంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ని కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అవకాశం ఇచ్చారు.