తెలంగాణాలో విస్తారంగా వర్షాలు : గోనెపల్లి వాగులో ఇద్దరి గల్లంతు

ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. 
 
సదరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్‌ సింగ్‌, మహారాష్ట్రలోని ముంబై వాసి సురేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీరాం సాగర్​, దిగువ మానేరు, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
 
​నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 46,558 క్యూసెక్కులు ఉండగా.. 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కులు దిగువకు విడదల అవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తానికి చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు