అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. 'హ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ చాలెంజ్' ఫైనల్స్‌లో ఐదుగురు విద్యార్థులు పోటీపడనున్నారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై ప్రతి ఐదేళ్లకోసారి నాసా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పాల్ వినీత్, ప్రకాశ్ రాయినేని, శ్రవణ్‌రావు, దిలీప్‌రెడ్డి, స్నేహ ఈ టీమ్‌లో ఉన్నారు. వీరిని ప్రొఫెసర్ మనోజ్ చౌదరి గైడ్ చేస్తున్నారు. చంద్రుడిపై సురక్షితంగా మానవులు తిరిగేందుకు రోవర్ డిజైన్‌ను తయారు చేసి, నివేదిక అందించడంలో అనేక దశలు దాటుకుని వీరు ఈ స్థాయికి చేరుకున్నారని ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం గురువారం తెలిపింది.
‘వేరే గ్రహంపై తిరుగాడేందుకు అనువైన వాహనాన్ని తయారు చేయాలని ప్రతిష్టాత్మక నాసా చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల నుంచి పోటీ పడగా, దేశం మొత్తం మీద 4 బృందాలు ఎంపికయ్యాయి’ అని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 12 నుంచి 14 వరకు అమెరికాలో హూస్టన్ విల్లేలోని అలబామా యూనివర్సిటీలో జరిగే నాసా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన వారితో పాటు తమ విద్యార్థులు చంద్రుడిపై తిరిగేందుకు అనువైన రోవర్‌ను డిజైన్ చేసి తయారు చేస్తారని పేర్కొంది.