అమెరికా తెలంగాణల మధ్య దృఢమైన బంధం: కేటీఆర్

బుధవారం, 11 మార్చి 2020 (06:06 IST)
అమెరికా కాన్సులేట్ నానక్ రాం గూడలో నిర్మిస్తున్న నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనేక  మిలియన్ల డాలర్లతో నిర్మిస్తున్న కాన్సుల్ జనరల్ కార్యాలయం వచ్చే సంవత్సరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటుందన్నారు.

ఈ మేరకు భారత్లో అమెరికా రాయబారి కేన్నత్ జస్టర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మంచి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

రెండు దేశాల మధ్య స్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత దేశ ప్రధాని మోడీ ఈ దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతానికి భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ జేస్టర్ కృషి చేశారన్నారు.

టాపింగ్ ఔట్ కార్యక్రమ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్, ఇంత భారీ కాన్సుల్ జనరల్ నూతన కార్యాలయం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణంలో దక్కను పీఠభూమి నిర్మాణ శైలిని ఇక్కడి సహజత్వానికి దగ్గరగా డిజైన్ రూపొందించిన అమెరికన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక్కడి కాన్సుల్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ నగర సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చిహ్నంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అమెరికా రాయబారి జస్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి సారి భారతదేశంలో పర్యటించిన నగరం హైదరాబాద్ అని, అప్పుడు జరిగిన సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి మిత్రుడిగా ఉంటూ వస్తున్నారని, ఇందుకు మంత్రి కేటీఆర్, అమెరికన్ రాయబారికి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం ఇక్కడి పౌరులకే గాక ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా సౌకర్యంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరియు తెలంగాణల మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు