తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని ఆఫీసులు ఒక్కచోటే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే.. జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ ఒక్కచోట కొలువుతీరేలా అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పోలీసు, అగ్నిమాపక శాఖ మినహా ఇతర అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలని ఆయన చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలోనూ జిల్లా పోలీసు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నూతన కార్యాలయాలు ఉన్నందున అవి మినహాయించి మిగిలిన 28 జిల్లాల్లో భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
తన అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలకు డిజైన్లను ఖరారు చేసి టెండర్లు పిలువాలని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాలు అన్ని వసతులతో ప్రజలకు, అధికారులకు అనువుగా ఉండాలని సీఎం సూచించారు.