యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్‌కు చెందిన ముచ్చెర్ల రాములు, మంగమ్మ (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె సుజాత వైకల్యంతో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని మంగమ్మ ఇటీవల కుమార్తె సుజాత పేరుపై రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలిసిన కోడలు జయశ్రీ అత్తతో వాగ్వాదానికి దిగింది.
ఇదే విషయంపై ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహం పట్టలేని జయశ్రీ అత్త మంగమ్మను రోకలి బండతో మోదింది. అనంతరం పదునైన ఆయుధం తీసుకొచ్చి అత్త రెండు కాళ్లను నరికేసింది. మంగమ్మ ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.