తెలంగాణాలో కాంగ్రెస్ తుఫాను - ఈ సారి కప్పు కొట్టడం ఖాయం : బండ్ల గణేశ్

సోమవారం, 26 జూన్ 2023 (22:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ యేడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన అనేక మంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు చేరారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క చేస్తున్న ప్రజా పాదయాత్రకు సినీ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొన్నారు. అన్నా.. వస్తున్నా అంటూ ఆదివారం ట్వీట్ చేసిన ఆయన. సోమవారం మర్యాదపూర్వకంగా భట్టిని కలుసుకుని సంఘీభావం తెలిపారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, "తుఫాను వస్తుంది. ఇప్పటికే కర్నాటక నుంచి ప్రారంభమైంది. తర్వాత తెలంగాణాను కొట్టుకుని ఢిల్లీదాకా వెళుతుంది. ఢిల్లీలో కూడా జెండా ఎగురువేస్తాం" అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 150 రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుందని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. "గొప్పలు చెప్పుకోం... డబ్బాలు కొట్టుకోం.. ప్రకటనలు ఇవ్వం.. సినిమాలు తియ్యం, ప్రజా సేవ చేస్తాం. తక్కువ మాట్లాడుదాం.. ఎక్కువ పని చేస్తాం.. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసే వాళ్ల పరిపాలన ఇక్కడ చూస్తున్నాం" అని అన్నారు. 
 
భట్టి విక్రమార్క వంటి నేతకు సంఘీభావం తెలపడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. తామంతా కలిసి పోరాడుతామని, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుందని బండ్ల గణేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రజలందరి సహకారాలు కావాలని కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని బండ్ల గణేశ్ ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు